నేడు మోప్కాల్ వద్ద కేసీఆర్ బహిరంగ సభ

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లా మొప్కాల్‌ గ్రామంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పధకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం ఆయన బుధవారమే ప్రాజెక్టు గెస్ట్ హౌస్ చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు.  

నిజామాబాద్ జిల్లాకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక పెరిగిపోయినందున దాని నీటి సామర్ధ్యం 112 టిఎంసి.ల నుంచి 90 టి.ఎం.సి.లకు పడిపోయింది. ఆ కారణంగా ప్రాజెక్టు ఆయకట్టులోని దిగువనున్న పొలాలకు నీళ్ళు అందడం కష్టమైపోతోంది. ఈ సమస్యను పరిష్కారంగా రివర్స్ పంపింగ్ పద్దతిలో ఎల్లంపల్లి నుంచి నందిమేడారం చెరువు ద్వారా గోదావరి నీటిని వరద కాలువలలోకి మళ్ళించి ఆ నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలిస్తారు. రోజుకు ఒక టి.ఎం.సి. చొప్పున వరుసగా 60 రోజుల పటు 60 టి.ఎం.సి.ల నీళ్ళను ఈవిధంగా తరలించి ప్రాజెక్టు ఆయకట్టులోని చిట్టచివరి పొలాలకు కూడా నీళ్ళు అందించాలని ప్రభుత్వం సకల్పించింది. దీని కోసం వరద కాలువపై మూడు చోట్ల రూ.1,091 కోట్ల వ్యయంతో మూడు ఆనకట్టలు కూడా నిర్మించబోతోంది. 

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో బారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, జిల్లా ఎమ్మెల్యేలు, తెరాస నేతలు తదితరులు ముఖ్యమంత్రి సభకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం సభ ముగిసిన తరువాత 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతారు.