మహారాష్ట్రలో స్థానికేతరులకే విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, కనుక మరాటాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గతంలో అనేకసార్లు చిన్నా పెద్ద ఉద్యమాలు జరిగాయి. బుదవారం మళ్ళీ మరోసారి మరాట క్రాంతి మోర్చా అధ్వర్యంలో మాహోద్యమం మొదలైంది.
మహారాష్ట్రాలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన లక్షల మంది మరాటాలు ఈరోజు ఉదయం ముంబై సమీపంలోని బైకుల్లా అనే ప్రాంతం నుంచి ఆజాద్ మైధాన్ వరకు బారీ మౌన ప్రదర్శన నిర్వహించారు. మహారాష్ట్ర చరిత్రలో అన్ని లక్షలమంది ఒక ర్యాలీలో పాల్గొనడం ఇదే మొదటిసారి. మరాటాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మౌనర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి మహారాష్ట్రాలోని అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ ర్యాలీ అనంతరం మరాట క్రాంతి మోర్చా ప్రతినిధులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి మరాటాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించవలసిందిగా వినతి పత్రం ఇస్తారు. దానిపై ప్రభుత్వ స్పందనను బట్టి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకొంటామని మరాట క్రాంతి మోర్చా ప్రతినిధులు తెలిపారు.
ఈరోజు జరిగిన ర్యాలీలో కనీసం 4-5 లక్షల మందికి పైగా పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీ కారణంగా ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకపోవడం ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.