అంతరాష్ట్ర బదిలీలకు ఉత్తర్వులు జారీ

రెండు తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వివిధ కారణాల చేత పొరుగు రాష్ట్రానికి బదిలీ కావాలని కోరుకొంటున్న ప్రభుత్వోద్యోగులు ఇప్పుడు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ బదిలీలకు నెలరోజులు గడువు కల్పించాయి. 

రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా కొందరు ఏపికి, కొందరు తెలంగాణాకు వెళ్ళవలసి వచ్చింది. వారిలో చాలా మంది తమ స్వంత రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకొంటున్నారు. ముఖ్యంగా వేర్వేరు రాష్ట్రాలలో పనిచేస్తున్న బార్యాభార్తలకు ఈ బదిలీ అవకాశం చాలా ఉపయోగపడుతుంది. 

రెండు ప్రభుత్వాలు ఉద్యోగుల బదిలీలకి కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేశాయి. ఒక ఉద్యోగికి ఈ ఒక్కసారి మాత్రమే బదిలీకి అవకాశం ఉంటుంది. వారుకోరుకొనే శాఖలో, ప్రాంతంలో ఖాళీ ఉంటేనే బదిలీకి అవకాశం ఉంటుంది. బదిలీ కోరుకొంటున్నవారి భర్త లేదా భార్య ఆ రాష్ట్రంలో స్థానికులై ఉండాలి. ఒకే స్థాయి ఉద్యోగులు పరస్పర బదిలీ చేసుకోవచ్చు. బదిలీపై వెళ్ళినవారికి సీనియారిటీలో చివరిస్థానం కేటాయించబడుతుంది. అదనంగా టీఏ, డిఏలు చెల్లించబడవు. 

బదిలీలకు ఇదే చిట్టచివరి అవకాశం కనుక రెండు రాష్ట్రాలలో బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ చొరవతో ఇది సాధ్యపడింది. ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులను ఇందుకు ఒప్పించడంతో బదిలీలకు అవకాశం కల్పిస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.