కాంగ్రెస్ నేత విక్రం గౌడ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో దూకినట్లయింది. తన సమస్యల నుంచి బయటపడేందుకు వేసిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. అది ఆయనను సమస్యల నుంచి బయటపడేయలేదు..జైలులో పడేసింది. తనపై తానే హత్యాప్రయత్నం చేసుకొని పోలీసులను తప్పుదారి పట్టించినందుకు ప్రస్తుతం విక్రం గౌడ్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.
పోలీసుల అభ్యర్ధన మేరకు విక్రం గౌడ్ ను ఒక్కరోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. అసలు విక్రం గౌడ్ ఇటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు? ఏవిధంగా చేశారు?మొదలైన వివరాలను తెలుసుకొనేందుకు ఈరోజు పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అహ్మద్ ఖాన్, రయీస్, నందకుమార్ లను మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని కూడా ప్రశ్నించి పూర్తి వివరాలు రాబట్టబోతున్నారు. విక్రం గౌడ్ ప్రదర్శించిన ఈ అతితెలివితేటల వలన అయన వ్యక్తిగత జీవితమే కాకుండా రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారింది.