హమ్మయ్యా.. కాంగ్రెస్ పరువు దక్కింది

గుజరాత్ లోని మూడు రాజ్యసభ స్థానాలకు భాజపా ముగ్గురిని, కాంగ్రెస్ ఒక్కరిని నిలబెట్టడంతో మొదలైన ఉత్కంఠ ఓట్ల లెక్కింపులో చివరి నిమిషం వరకు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక అభ్యర్ధిని అవలీలగా గెలిపించుకొనేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి భాజపా అనేక పన్నాగాలు పన్నడంతో ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన అహ్మద్ పటేల్ తన గెలుపు కోసం చాలా కష్టపడవలసి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున అయన గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకొన్నాయి. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా చేస్తున్నందున కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవేళ ఆయన ఈ ఎన్నికలలో ఓడిపోయుంటే కాంగ్రెస్ పార్టీకి తీరని అప్రదిష్టగా మారి ఉండేది. కానీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అతికష్టం మీద అహ్మద్ పటేల్ విజయం సాధించడంతో కాంగ్రెస్ అధిష్టానం పరువు దక్కింది. భాజపా తరపున అమిత్ షా, స్మృతీ ఇరానీ ఊహించినట్లే ఈ ఎన్నికలలో విజయం సాధించారు.