కొడుకుని చూసి వైఎస్ భయపడ్డారుట!

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో సచివాలయం వద్ద ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన కొడుకు వలన తన పదవికి గండం ఉండవచ్చని భావించి, జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ లో ఉండనీయలేదని, ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తనకు చెప్పారని అన్నారు.

చంద్రబాబు రాజకీయ దురుదేశ్యంతో జగన్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లనిపించడం సహజమే కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తహతహలాడుతున్నారో గమనించినట్లయితే చంద్రబాబు చెప్పిన ఈ విషయం నమ్మకతప్పదు. రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన వెంటనే జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి శరవేగంగా పావులు కదిపినప్పటికీ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కనుక అతనికి ముఖ్యమంత్రి కావాలనే తపన తన తండ్రి బ్రతికి ఉన్నప్పటి నుంచే ఉందని అనుమానం కలుగుతోంది. కనుక చంద్రబాబు చెప్పిన ఈ విషయం నిజమే అయ్యుండవచ్చు. 

2014 ఎన్నికలలో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుదామని చాలా కలలు కన్నారు. కానీ త్రుటిలో అధికారం చేజారిపోయింది. అప్పటి నుంచి నిత్యం తను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొంటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మనసులో దాచుకొన్న ప్రగాడమైన కోర్కెను కొన్ని రోజుల క్రితం స్వయంగా బయటపెట్టుకొన్నారు. తనకు కనీసం 30 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉందని స్వయంగా చెప్పుకొన్నారు.

తన ఆ కలను సాకారం చేసుకోవడం కోసం అప్పుడే ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ను రప్పించారు. వచ్చే ఎన్నికల కోసం నవరత్నాలు పేరిట అప్పుడే 9 వాగ్దానాలు చేశారు. అక్టోబర్ 27 నుంచి ఏపిలో 3,000 కిమీ పాదయాత్ర చేయబోతున్నారు. పదవి, అధికారాలపై రాజకీయ నేతలు అందరికీ వ్యామోహం ఉండటం సాధారణమైన విషయమే కానీ ఆ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకొని నవ్వులపాలవుతుంటారు. అంతే తేడా!