మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులపై జి.ఎస్.టి. విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. జి.ఎస్.టి.వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉన్న సిబిఐ కేసులకు భయపడి జి.ఎస్.టి.కు గుడ్డిగా మద్దతు పలకడమే కాకుండా శాసనసభలో చాలా హడావుడిగా దానికి ఆమోదముద్ర వేయించారని విమర్శించారు.
అప్పుడు హడావుడిగా దానికి ఆమోదముద్ర వేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినట్లయితే కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకోక తప్పదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జి.ఎస్.టి. వలన రాష్ట్రానికి నష్టం వస్తుందని తెలిసి ఉన్నప్పుడు మొదటే దానిపై కేంద్రానికి అభ్యంతరాలు తెలిపి, ఆ ప్రాజెక్టులకు జి.ఎస్.టి. మినహాయింపు కోసం గట్టిగా పట్టుపట్టి ఉండి ఉంటే బాగుండేదని కానీ అప్పుడు గుడ్డిగా మద్దతు పలికి ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలనుకోవడం వలన ఏ ప్రయోజనం ఉండబోదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.