నేడు రాజ్యసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. గుజరాత్ లో 3 స్థానాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6 స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఆయన విజయం సాధించడం తద్యమే. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను తన మంత్రివర్గంలో తీసుకొనే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పదవీకాలం కూడా ముగుస్తుండటంతో ఆమె కూడా గుజరాత్ నుంచి మళ్ళీ రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీ ప్రధాన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా గుజరాత్ నుంచే పోటీ చేస్తున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికవడానికి కనీసం 46 మంది ఎమ్మెల్యేలల మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్ పార్టీలో 44మంది మాత్రమే ఉన్నారు. కనుక బయటపార్టీల ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున అక్కడ కాంగ్రెస్, భాజపాలకు చోటు లేదు. కనుక రెంటికీ గుజరాత్ లోని 3 స్థానాలు చాలా కీలకమైనవి. వాటిని భాజపా దక్కించుకొనే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.