అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ నిన్న మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రగతి భవన్ లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా చిన్న రాష్ట్రాలలో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక తరచూ రాజకీయ అనిశ్చిత ఏర్పడే అవకాశం ఉంటుంది. రాష్ట్ర విభజన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది కనుక సుస్థిరమైన పాలన కొనసాగడానికి వీలుగా రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచాలని గత యూపియే ప్రభుత్వమే భావించి ఆ హామీని విభజన చట్టంలో చేర్చింది. అయితే దీనిని ఆ చట్టంలో చేర్చిన పెద్దమనిషి జైరాం రమేష్ చేసిన చిన్న పొరపాటు వలన సీట్ల పెంపు చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా మారిపోయింది.
అయినప్పటికీ విభజన చట్టంలో హామీ ఇచ్చి ఉన్నారు కనుక నేను ప్రధాని నరేంద్ర మోడీ కలిసినప్పుడు దాని గురించి గుర్తుచేశాను. కానీ ఆయన తప్పకుండా పెంచుతామని చెప్పలేదు. చూద్దాం అన్నారు. అంటే సీట్లు పెంచే ఉద్దేశ్యంలో లేరని అర్ధం అయ్యింది. అయితే సీట్లు పెంచినా పెంచకున్నా మాకేమీ ఫరక్ పడదని అప్పుడే చెప్పాను. మళ్ళీ ఇప్పుడూ చెపుతున్నాను. మేము చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాము. సీట్లు పెరిగినా పెరగకపోయినా మేము ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించగలమనె నమ్మకం మాకుంది. కనుక సీట్లు పెరిగితే మంచిదే..పెరుగకపోయినా మాకొచ్చే నష్టమేమీ లేదు,” అని కేసీఆర్ అన్నారు.