వాళ్ళ ఆశలకు హైకోర్టు స్టే

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయడానికి చట్టపరంగా కొన్ని అవరోధాలు ఎదురవుతున్నందున తెరాస సర్కార్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న సుమారు 21,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అబ్జార్బేషన్ పేరిట సంస్థలో విలీనం చేయాలనుకొంది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ స్టే విధించడంతో వారి ఆశలు ఆవిరైపోయాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరినీ క్రమబద్దీకరించవద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. అంతవరకు వారిని యధాతధ స్థితిలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో వారు చేస్తున్న పనినిబట్టి ఎవరెవరికి ఎంతెంత జీతాలు చెల్లించాలో ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఆలోగా విద్యుత్ సంస్థలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. హైకోర్టు సూచనలకు కట్టుబడి ఉంటామని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి అభ్యంతరం చెప్పినప్పటికీ వారి జీతాల పెంపు విషయంలో చాలా మానవతాదృక్పధం ప్రదర్శించిందని అందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలుపుకొంతున్నానని అన్నారు. హైకోర్టు చెప్పినదాని కంటే మరికొంత ఎక్కువే తమ ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించుకొందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనే హామీని నిలబెట్టుకోవడానికి తెరాస సర్కార్ ప్రయత్నిస్తే దానినీ వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలవడం గమనిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పనిచేసుకోనీయకుండా పిటిషన్లతో అడుగడుగునా అడ్డు పడుతున్నాయనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణ నిజమని అర్ధం అవుతోంది. ఒకవైపు ఉద్యోగాల భర్తీ చేయడం లేదని ధర్నాలు చేస్తుంటారు. మరోవైపు ఉద్యోగాల భర్తీ చేయబోతే ఈవిధంగా అడ్డుపడుతుంటారు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనవతాదృక్పధంతో వ్యవహరిస్తూ వారి జీతాలు పెంచి కొంత ఊరట కలిగించడం అభినందనీయం.