రాష్ట్రంలో మరే పార్టీకి ఛాన్స్ ఉండదు: కేసీఆర్

 ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ చాలా రోజుల తరువాత నిన్న మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర రాజాకీయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు చేయడమే తప్ప ఏనాడు ఏపని చిత్తశుద్ధితో పనిచేసి ఎరుగదు. అది పని చేయలేదు..మమ్మల్ని కూడా పని చేయనీయడం లేదు. ప్రాజెక్టులు కడతామంటే పిటిషన్లు..ఉద్యోగాలు ఇస్తుంటే పిటిషన్లు..చివరకు కొత్త సచివాలయం కడదామనుకొన్నా కోర్టులో పిటిషన్ వేయించి అడ్డుపడుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రానికి, దేశానికి పట్టిన శని. అందుకే దానిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. తమను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిసి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు. కానీ వారి భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందనే సంగతి గ్రహించడం లేదు. 

ఇక బూజుపట్టిన సిద్దాంతాలు పట్టుకొని వ్రేలాడుతున్న వామపక్షాలు ‘మా తాతలు నేతులు త్రాగారన్నట్లు’ వ్యవహరిస్తున్నాయి. అసలు దేశంలో వామపక్షాలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణాలో అయితే ఒకరిద్దరు తప్ప మరెవరైనా ఉన్నారా ఆ పార్టీకి? ఎక్కడా కనబడని వాళ్ళు కూడా నోటికి వచ్చినట్లు మా ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. 

తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మేము చిత్తశుద్ధితో చేసుకుపోతున్న పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. పనిపాటు లేని ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలు, ఆరోపణలకు మేము భయపడము. వచ్చే ఎన్నికల ఫలితాలే మా పాలనకు గీటురాయి. ప్రతిపక్షాలు అంతవరకు ఓపిక పడితే వాటి పరిస్థితి ఏమిటో వాటికే అర్ధం అవుతుంది,” అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.