అధికారంలో ఉన్నాం...మమ్మల్ని ఎవరూ టచ్ చేయకూడదని చాలా మంది నేతలు తమ మాటల ద్వారానో చేతల ద్వారానో అందరికీ అర్ధమయ్యేలాగ చెపుతూనే ఉంటారు. ఈవిషయంలో ప్రతిపక్షపార్టీల నేతల తీరు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఓవరాల్ గా రాజకీయ నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా తమను ఎవరూ టచ్ చేయకూడదని భావిస్తారన్న మాట.
ప్రతిపక్ష నేతలపై ఐటి, ఈడి, సిబిఐ రెయిడ్స్ జరిగితే అవి రాజకీయ కక్ష సాధింపుగా చూపించి తమపై ఈగ వాలకుండా జాగ్రత్త పడుతుంటారు. కర్నాటక విద్యుత్ శాఖా మంత్రి డికె శివకుమార్ కు చెందిన డిల్లీ, బెంగళూరు నగరాలలో గల ఇళ్ళపై నేడు ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించి రూ.7.5 కోట్లు నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఆయనకు, ఆయన సమీప బంధువులకు చెందిన మొత్తం 39 ఇళ్ళు, కార్యాలయాలలో 120మంది ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంటులో చాలా రభస చేసింది.
త్వరలో గుజరాత్ లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికలకలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి దాని 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు చాలా కీలకం. కనుక వారిని భాజపా నుంచి కాపాడుకోవడానికి బెంగళూరు తరలించి అక్కడ ఒక రిసార్ట్ లో క్యాంప్ ఏర్పాటు చేసింది. మంత్రి శివకుమార్ అక్కడ వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకొంటున్నారు. అందుకే మోడీ సర్కార్ ఆయనపై కక్ష కట్టి ఐటి దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అది నిజమే కావచ్చు. కానీ అయన నివాసం నుంచి ఏకంగా రూ.7.5 కోట్లు నగదు లభించిన మాట కూడా వాస్తవమేనని కాంగ్రెస్ చెప్పడం లేదు. నోట్లరద్దు తరువాత 10-20 వేలు నగదు లభించడమే కష్టంగా ఉన్నప్పుడు శివకుమార్ ఇంటిలో రూ.7.5 కోట్లు నగదు లభించిందంటే అర్ధమేమిటి? అతనికి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? అని ఐటి శాఖ నిలదీస్తే అది రాజకీయ కక్ష సాధింపు ఎలా అవుతుంది?
అధికారంలో ఉన్నవారు ఈ నల్లదనం వెలికి తీయాలనే చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లయితే దానిని ఎవరూ ఈవిధంగా వేలెత్తి చూపలేరు. తప్పించుకోలేరు. కానీ దాని నిర్ణయాల వెనుక రాజకీయ కోణాలు, కారణాలు కూడా ఉంటే దోషులు కూడా ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతారు.