సిసిఎంబి వ్యవస్థాపకుడు భార్గవ మృతి

భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్ఞులలో ఒకరైన పుష్పామిత్ర భార్గవ (89) మంగళవారం సాయంత్రం ఉప్పల్ లోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన కృషి వలననే హైదరాబాద్ లో సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ స్థాపించబడింది. తరువాత ఆయనే దానికి వ్యవస్థాపక డైరెక్టర్ గా చిరకాలం సేవలు అందించారు. 

పిఎం.భార్గవగా అందరికీ సుపరిచితులైన పుష్పామిత్ర భార్గవ రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం రాజస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్ తరలివెళ్ళడంతో అక్కడే పి.హెచ్.డి వరకు భార్గవ విద్యాభ్యాసం అంతా పూర్తయింది. 

ఆయన మొదటిసారిగా 1950లో హైదరాబాద్ వచ్చి ఇక్కడి సెంట్రల్ ల్యాబ్స్ లో మూడేళ్ళపాటు పరిశోధనలు చేశారు. కెనడా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ తదితర 50 దేశాలలో పర్యటించి అనేక ప్రఖ్యాత సంస్థలలో పరిశోధనలు చేశారు. అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆయన విశేష కృషితో 1977లో హైదరాబాద్ లో సీసీఎంబీ స్థాపన జరిగినప్పటి నుంచి 1990 వరకు దాని డైరెక్టర్ గా సేవలు అందించారు. సైన్స్ రంగంలో ఆయన చేసిన విశేషకృషికి గుర్తింపుగా 1986లో ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది. కానీ ఎన్డీయే ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్చను హరించేవిధంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా 2015లో ఆ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.

పిఎం భార్గవ అర్ధాంగి మనోరమ ఏడాది క్రితమే మరణించారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎల్లుండి అంటే ఆగస్ట్ 4న జూబ్లీ హిల్స్ లోగల మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబడతాయి. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.