ఏటా రక్షాబంధన్ రోజున మహిళలు తమ సోదరులకు బొట్టుపెట్టి హారతి ఇచ్చి రాఖీ కడుతుంటారు. తద్వారా వారి అనుబంధం మరింత బలపడుతుంది. తన సోదరుడు చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని సోదరి కోరుకొంటే, ఆమెకు జీవితాంతం ఏ కష్టం రాకుండా తండ్రిలా కాపాడుతానని సోదరుడు హామీ ఇస్తాడు. ఇదే రాఖీ పండుగ పరమార్ధం. అయితే దానిని త్రికరణశుద్ధిగా ఎందరు స్వీకరిస్తారో తెలియదు కానీ ఇది చాలా ఉదాత్తమైన పండుగ అని చెప్పవచ్చు. దానికి మరింత వన్నెలద్దే ప్రయత్నం చేశారు తెరాస నిజామాబాద్ ఎంపి కవిత.
ఈసారి రాఖీ పండుగ సందర్భంగా దేశంలో మహిళలు అందరూ తమ సోదరులకు హెల్మెట్ లను బహుకరించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పడమే కాదు..తన సోదరుడు కేటిఆర్ జన్మదినం రోజున హెల్మెట్ బహుమతిగా ఇచ్చారు కూడా.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏటా మన దేశంలో సుమారు 40 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. వారిలో అధికశాతం హెల్మెట్ ధరించకపోవడం వలననే మరనిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఈసారి ఆగస్ట్ 7వ తేదీన రాఖీ పండుగ రోజున రాష్ట్రంలో..దేశంలో మహిళలు అందరూ మీ ప్రియమైన సోదరులకు హెల్మెట్స్ బహుమతిగా ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వడం అంటే ఒక జీవితం బహుమతి ఇచ్చినట్లేనని అందరూ గ్రహించాలి. మహిళలు చేసే ఈ చిన్న పని వలన ఎంతో మంది సోదరుల ప్రాణాలు కాపాడుకోవచ్చు. కనుక గిఫ్ట్ హెల్మెట్..గిఫ్ట్ లైఫ్ అనే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు కవిత.