కాంగ్రెస్ నేత విక్రంగౌడ్ కేసులో పోలీసుల అనుమానాలే నిజమని నిరూపితం అయ్యాయి. ఆ కేసులో విక్రంగౌడ్ తనపై తనే స్వయంగా హత్యాప్రయత్నం చేయించుకొన్నట్లు పోలీసులు ఆధారాలతో సహా కనుగొన్నారు. చేస్తున్న వ్యాపారాలలో నష్టాలు వస్తుండటం, ఆ కారణంగా అప్పులు చేయవలసి రావడం, అప్పులు ఇచ్చినవారి నుంచి తీవ్ర ఒత్తిళ్ళు వస్తుండటంతో వాటన్నిటి నుంచి బయటపడేందుకే విక్రంగౌడ్ ఈ హత్యాప్రయత్నం డ్రామాను ఆడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇందుకోసం అతను ఏర్పాటు చేసుకొన్న ఐదుగురు వ్యక్తులను, వారి తుపాకులతో సహా పోలీసులు పట్టుకొన్నారు. వారిని విచారించినప్పుడు ఈవిషయాలన్నీ బయటపడ్డాయి.
విక్రంగౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్. ఆయన కూడబెట్టిన ఆస్తులను తన కొడుకు చేతికి అప్పగించకుండా తన తమ్ముడు చేతిలో పెట్టారు. వాటిని దక్కించుకొని ఈ అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశ్యంతోనే విక్రంగౌడ్ ఈ హత్యాప్రయత్నం డ్రామా ఆడారు. అయితే దానితో విక్రంగౌడ్ చేతికి డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ ఉద్దేశ్యపూర్వకంగా పోలీసులను త్రప్పు ద్రోవపట్టించినందుకు విక్రంగౌడ్ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇటువంటి చవుకబారు ఆలోచన కారణంగా రాజకీయాలలో పైకి ఎదిగే అవకాశం ఉన్న విక్రంగౌడ్ దానిని చేజేతులా నాశనం చేసుకొన్నట్లయింది.