వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంతోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కులరాజకీయాలు చేస్తూ ప్రజల మద్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని తెరాస ఎంపి బాల్క సుమన్ ఆరోపించారు. కొందరు డిల్లీ కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నేరెళ్ళ ఘటనను హైలైట్ చేసి రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని సుమన్ ఆరోపించారు. మీరా కుమార్ పర్యటనే అందుకు నిదర్శనమని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా అది రాష్ట్రంలో ఎన్నటికీ అధికారంలోకి రాలేదని సుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే మళ్ళీ గట్టిగా బుద్ధి చెపుతారని అన్నారు.
కాంగ్రెస్ నేతలు ఈ నేరెళ్ళ ఘటనపై చేస్తున్న హడావుడి చూస్తుంటే వారికి వేరే అంశం ఏదీ లేనందునే దీనిని పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటిఆర్ చేసిన విమర్శలు నిజమేనని అనిపించకమానదు. నేరెళ్ళ ఘటనలో భాదితులకు కాంగ్రెస్ నేతలు ఏ సహాయం చేయలేదు కానీ వారికి అన్యాయం జరిగిపోయింది..రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ చాలా హడావుడి చేస్తున్నారు. వారు ఈ సమస్య నుంచి రాజకీయ మైలేజి పొందడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది.
కాంగ్రెస్ పార్టీ దళితులతో సహా దేశంలో ప్రజలందరినీ ఎప్పుడూ ఓటర్లుగానే చూస్తుంది తప్ప మనుషులుగా కాదని నిరూపించడానికి ఇది చక్కటి ఉదాహారణగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో నేరెళ్ళ ఘటనను హైలైట్ చేయడం కోసం దళితురాలైన మీరా కుమార్ ను రాష్ట్రానికి రప్పించడం కాంగ్రెస్ నీచరాజకీయాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. ఇటువంటి రాజకీయాలు చేయబట్టే పజలు కాంగ్రెస్ పార్టీని పక్కనబెడుతున్నారని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక తెరాస సర్కార్ కూడా ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించి కాంగ్రెస్ సభను అడ్డుకోవడం ద్వారా వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. వారిని నిన్న సభ నిర్వహించుకోనిచ్చి ఉంటే ఈరోజు దాని గురించి ఎవరూ మాట్లాడుకొని ఉండేవారు కారు. కానీ అడ్డుకోవడం వలన తెరాస సర్కార్ ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందనే భావన ప్రజలకు కలిగడానికి ఆస్కారం ఏర్పడింది.