జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అక్టోబర్ లోగా తను ఒప్పుకొన్న సినిమాలు పూర్తిచేసి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. ఈ విషయం ఆయనే నిన్న స్వయంగా చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ భాధితుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తరువాత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ నాకు తెలుగుదేశం పార్టీతో రహస్య సంబంధం ఉందనడం సరికాదు. గత ఎన్నికలలో నేను తెలుగుదేశం, బిజెపిలకు బహిరంగంగానే మద్దతు ఇచ్చాను కదా ఇక దీనిలో రహస్యమేముంది? అనేక సందర్భాలలో నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను కదా? దానితో రహస్య అవగాహన ఉంటే ఎందుకు విమర్శిస్తాను? ప్రజల సమస్యల పరిష్కారమే నాకు ముఖ్యం కానీ రాజకీయాలు కాదు. అందుకోసం నేను పాదయాత్ర..లేదా బస్సు యాత్ర ఏదో ఒకటి చేయాలనుకొంటున్నాను..అప్పుడే నాకు నా పార్టీకి ప్రజలలో ఏ మాత్రం ఆదరణ ఉందో అర్ధం అవుతుంది. ణా దృష్టికి అనేక ప్రజా సమస్యలు వచ్చాయి. కానీ వాటి కోసం నేను స్వయంగా అక్కడికి వెళితే నావలన మళ్ళీ కొత్త సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కానీ అలాగని ఎల్లకాలం ఇంట్లోనే కూర్చొంటే కుదరదు కనుక ఈ అక్టోబర్ నెల నుంచే నేను నా పూర్తి సమయాన్ని రాజకీయాలలు కేటాయిస్తాను,” అని చెప్పారు.