నేరెళ్ళ సంఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిరిసిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించబోతోంది. కానీ సభ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితులలో సభ నిర్వహించి తీరుతామని చెపుతున్నారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను కూడా ఈ సభకు ఆహ్వానించారు కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ సభ నిర్వహణను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ఈరోజు సభను ప్రారంభించేముందు మీరా కుమార్ తో కలిసి కాంగ్రెస్ నేతలు నేరెళ్ళ భాదిత కుటుంబాలను పరామర్శించాలని కూడా నిర్ణయించారు. కానీ దానికీ ప్రభుత్వం అనుమతించలేదు. ఈ రెండు కార్యకరమాలు తప్పకుండా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు చాలా పట్టుదలగా ఉంటే, వాటిని ఎట్టి పరిస్థితులలో అనుమతించరాదని ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది. సిరిసిల్లా అంతటా పోలీసులను మొహరించింది. కనుక ప్రస్తుతం సిరిసిల్లాలో యుద్దవాతావరణం నెలకొని ఉంది.
సభ నిర్వహించకుండా, నేరెళ్ళ భాదిత కుటుంబాలను కాంగ్రెస్ నేతలు కలువకుండా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిపిస్తోందనే విషయం గుర్తించినట్లు లేదు. నేరళ్ల భాదితులకు ఎటువంటి అన్యాయం జరుగకపోయుంటే ప్రభుత్వం ఎందుకు కాంగ్రెస్ నేతలను అడ్డుకొంటోంది?ఇదివరకు అనేకసార్లు కాంగ్రెస్ సభలను అనుమతించిన తెరాస సర్కార్ ఇప్పుడి సిరిసిల్లాలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించుకొంటే ఏమిటి ఇబ్బంది? ఎందుకు సభను అడ్డుకోవాలనుకొంటోంది? వంటి సందేహాలు కలుగుతాయి. ఆ సభను, సమావేశాలను అడ్డుకోవడం ద్వారా తెరాస సర్కారే వాటికి ప్రాధాన్యత పెంచినట్లయింది.