“తెరాస అధికారంలోకి వస్తే ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు వారికి ఇచ్చిందేమీ లేదు కానీ ప్రాజెక్టుల పేరు చెప్పి వారి భూములనే గుంజుకొని వారిని రోడ్డున పడేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో రాజకీయనేతల భూములు వదిలిపెట్టి నిరుపేద రైతుల భూములను గుంజుకొంటోంది తెరాస సర్కార్. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే రైతులకు మేలు కలుగుతుందని ఆశిస్తే పేదరైతులు అన్ని విధాల దోపిడీకి గురవుతున్నారు. రైతులు ఒక్కరే కాదు..అన్ని వర్గాల ప్రజలు ఎదోరకమైన దోపిడీకి గురయ్యి నష్టపోతూనే ఉన్నారు. తెరాస నేతలు చెప్పుకొంటున్న అభివృద్ధి ఇదేనా? దేనికోసమేనా మనం పోరాడి తెలంగాణా సాధించుకొన్నాము? తెలంగాణా ఆశయసాధన, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైంది. తెలంగాణాలో అభివృద్ధి తెరాస నేతల మాటలలో, కాగితాల మీదనే కనిపిస్తోంది తప్ప వాస్తవంగా ఎక్కడా కనబడటం లేదు. రాష్ట్రంలో అన్ని రంగాలు మెల్లగా చతికిలపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,” అని విమర్శించారు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్.
అమరవీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ ఆదివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, మామిడి, వర్గోల్ మండలాలలో పర్యటించినప్పుడు తెరాస సర్కార్ ఈ విమర్శలు చేశారు.