విక్రం గౌడ్ పోలీసులకు ఏమి చెప్పాడంటే..

ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత విక్రం గౌడ్ కాస్త కోలుకోవడంతో శుక్రవారం ఉదయం తన ఇంట్లో జరిగిన తనపై జరిగిన కాల్పుల సంఘటనపై పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోకి జొరబడి తనపై కాల్పులు జరిపి పారిపోయాడని చెప్పారు. తను తీవ్రంగా గాయపడినప్పటికీ వెంటనే తన భార్యను కేకేసి అంబులెన్స్ పిలవమని చెప్పానని కానీ అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించి ఆమె తనను తమ కారులోనే ఆసుపత్రికి తీసుకువచ్చి జేర్చిందని చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని తను గుర్తుపట్టలేనని తెలిపారు. కానీ అతను ఎవరైనా పట్టుకొని శిక్షించాలని పోలీసులను కోరారు. ఈరోజు ఆసుపత్రి వద్ద విక్రం గౌడ్ భార్య విలేఖరులతో మాట్లాడుతూ, “నిన్న జరిగినదంతా నా భర్త పోలీసులకు తెలిపారు. దానిపై వారు దర్యాప్తు చేస్తున్నారు. కనుక దయచేసి మాగురించి నిరాధారమైన కధనాలు ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను, “ అని అన్నారు. 

ఈ కేసు గురించి మీడియాలో అప్పుడే చాలా కధనాలు వచ్చేయి. అవి వ్యక్తిగతంగా విక్రం గౌడ్ కుటుంబ ప్రతిష్టకు ఎంతో కొంత నష్టం కలిగించేవే కనుక ఆమె ఆవిధంగా కోరి ఉండవచ్చు. విక్రం గౌడ్ ఇంటి చుట్టూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కనుక సిసి కెమెరాలు కూడా ఉండే ఉంటాయి వాటిని ఫుటేజిని పోలీసులు కూడా పరిశీలించే ఉండాలి. కనుక విక్రం గౌడ్ పై కాల్పులు జరిపింది ఎవరనే విషయం నేడో రేపో బయటపడకమానదు. కనుక అతని భార్య కోరినట్లు ఈలోపుగా మీడియా ఈకేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణ పాటిస్తే బాగుంటుంది.