హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్-ఫ్రీ నగరంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతుంటే మరో పక్క ఆయన కుమారుడు కేటిఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల స్వయంగా ఈవెంట్స్ నౌ అనే సంస్థను నడుపుతున్నారని, ఆ పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ కేటిఆర్ కు దగ్గ బందువు కావడంతో ఈవెంట్స్ నౌ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి బారీగా నిధులు అందుతున్నాయని ఆరోపించారు.
ఫ్రెంచ్ డిజె డేవిడ్ గుట్యా హైదరాబాద్ వచ్చినప్పుడు కేటిఆర్ ఆహ్వానిస్తే అతనితో ఈవెంట్స్ నౌ షో నిర్వహించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవారున్నా విడిచిపెట్టమని చెపుతున్న అకున్ సబర్వాల్ కొంత కాలం క్రితం హైదరాబాద్ లో ఫ్రెంచ్ డిజె డేవిడ్ గుట్యాతో ఈవెంట్స్ నౌ నిర్వహించిన షో వీడియో ఫుటేజిని పరిశీలించగలదా? అని సవాలు విసిరారు.
తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్ళలో నగరంలో కొత్తగా 57 పబ్బులకు అనుమతులు మంజూరు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. నగరంలో డ్రగ్స్ కేసులు పెరగడానికి కేటిఆర్ సన్నిహితులే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. కనుక ప్రభుత్వం ముందుగా కేటిఆర్ సన్నిహితులను, తెరాస నేతలను విచారించాలని సిట్ ను ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయన చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవేనని అర్ధమవుతోంది. మరి కేటిఆర్ వీటిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.