భాజపా ఎమ్మెల్యేపై తెలంగాణా ప్రభుత్వం చర్యలు?

గతంలో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించినందుకు చట్టపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు భాజపా ఎమ్మెల్యే వంతు వచ్చింది. అయితే ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం అతను చేసిన ప్రసంగంపై తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు స్పందించడమే ఆలోచింపజేస్తోంది.

2013వ సంవత్సరం సెప్టెంబరు 29వ తేదీన హైదరాబాద్ షాయినాయత్ గంజ్ లో జరిగిన ‘గోరక్ష గర్జన-సనాతన ధర్మసభ’ లో రాజాసింగ్ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక పిర్యాదు నమోదు అయ్యింది. అప్పుడు పోలీసులు దర్యాప్తు జరిపి ఆయనపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే అతను ఇప్పుడు ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే) కనుక అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి అవసరం. అందుకోసం హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి వ్రాసిన లేఖపై తెలంగాణా న్యాయశాఖ సానుకూలంగా స్పందించింది. భాజపా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అనుమతించింది. 

రాజా సింగ్ భాజపా ఎమ్మెల్యే అయినప్పటికీ అతను తెలంగాణాలో పార్టీ కార్యక్రమాలకు, రాష్ట్ర నేతలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. కనుక ప్రభుత్వం రాష్ట్ర భాజపా నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ వారు అతనికి అండగా నిలబడదలిస్తే ఈ అంశంపై తెరాస, భాజపాల మద్య మరో రాజకీయ యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.