గవర్నర్ నరసింహన్ స్థానంలో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు రాబోతున్నారని ఇదివరకు చాలాసార్లు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మరోసారి వస్తున్నాయి. కానీ ఈసారి తప్పకుండా కొత్త గవర్నర్లు రాబోతున్నారు. ఈవిషయం ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా దృవీకరించారు.
గవర్నర్ నరసింహన్ పదవీకాలం గత ఏడాది మార్చిలోనే ముగిసింది. కానీ కొత్త గవర్నర్ నియమింపబడే వరకు ఆయనకు కేంద్రప్రభుత్వం పొడిగింపునిచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత ఎప్పుడైనా రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలనుకొంటున్నట్లు కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రులిరువురికీ తెలియజేసింది. ఏపికి ఆనందీ బెన్, తెలంగాణాకు డి.హెచ్.శంకరమూర్తి గవర్నర్లుగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఆనందీ బెన్ గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. శంకరమూర్తి కర్నాటక భాజపా నేత మరియు శాసనమండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
గవర్నర్ల నియామకంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త గవర్నర్ల నియామకం తధ్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను బట్టి స్పష్టం అవుతోంది.