ఈరోజు తెల్లవారుజామున మాజీ కాంగ్రెస్ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. హైదరాబాద్ లో అయన నివాసంలోకి దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో విక్రం గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. అయన చేతికి, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. వెంటనే అతని కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆపరేష్ చేసి అతని శరీరంలో నుంచి మూడు బుల్లెట్స్ బయటకు తీశినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు విక్రం గౌడ్ ఇంటికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై ఎవరు కాల్పులు జరిపారు? ఎందుకు జరిపారు? అనే విషయాలు ఇంకా తెలియవలసి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. విక్రం గౌడ్ ను ప్రశ్నించి తెలుసుకొనేందుకు పోలీసులు ఆసుపత్రి చేరుకొన్నారు. కానీ ఆపరేషన్ కారణంగా ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నందున వివరాలు తెలియలేదు. అతను స్పృహలోకి వస్తేగానీ అతనిపై ఎవరు కాల్పులు జరిపారనే విషయం బయటపడదు.