సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కేసులలో విచారణను ఎదుర్కొంటునందున సినీపరిశ్రమపై పడిన ఆ మచ్చను తొలగించుకొనే ప్రయత్నంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈనెల 30వ తేదీ ఉదయం 7గంటలకు హైదరాబాద్ లో యాంటీ డ్రగ్ వాక్ నిర్వహించబోతోంది. ఆ కార్యక్రమనికి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.
మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మీడియాతో మాట్లాడుతూ, “ఈ డ్రగ్స్ కారణంగా యావత్ సినీపరిశ్రమ చాలా పెద్ద అపనింద మోయవలసివస్తోంది. సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగాలలో డ్రగ్స్ తీసుకొనేవారు ఒకరిద్దరు ఉంటారు. కానీ సినీపరిశ్రమకున్న ప్రత్యేక ఆకర్షణ కారణంగా అందరి దృష్టి మాపై కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో ఎవరూ డ్రగ్స్ వాడకాన్ని సమర్ధించడం లేదు. ఆ విషయం తెలియజేసేందుకు ఈ యాంటీ డ్రగ్ వాక్ తలపెట్టాము,” అని అన్నారు.
మంత్రి పద్మారావు మాట్లాడుతూ, “సినీపరిశ్రమపై ప్రభుత్వం కక్ష కట్టిందని చేస్తున్న ఆరోపణలు సరికాదు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకు సినీపరిశ్రమలోవారు కూడా ఈవిధంగా సహకరిస్తునందుకు చాలా సంతోషం. యాంటీ డ్రగ్ వాక్ చాలా మంచి నిర్ణయం. అందరం కలిసి హైదరాబాద్ నగరాన్ని డ్రగ్-ఫ్రీ చేద్దాము,” అని అన్నారు.