జనసేనకు అంత సీన్ లేదు: కేసీఆర్

జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తుందని దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు కనుక అందుకోసం రెండు రాష్ట్రాలలో తన పార్టీని నిర్మించుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జనసేనకు అంత సీన్ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో దాని ప్రభావం అసలు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదివరకు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చివరకు తను ఆశించిన లక్ష్యం సాధించలేక కనీసం దానిని నడిపించలేక కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. కనుక జనసేన పార్టీ కూడా భవిష్యత్ లో అటువంటి పరిస్థితే ఎదురవవచ్చునని, రాజకీయ పార్టీని నడిపించడం అంత సులువు కాదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో వామపక్షాలతో కలిసి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వాటితో జత కట్టినా తెలంగాణా ప్రజలు జనసేనను ఆదరిస్తారా అంటే అనుమానమే. కారణాలు అందరికీ తెలిసినవే.

ఏపిలో పవన్ కళ్యాణ్ కు చాలా మంది అభిమానులున్నారు కనుక ఆ రాష్ట్రంలో జనసేన కొంత ప్రభావం చూపవచ్చు. కానీ ఎన్నికలలో జనసేన ఏ పార్టీతో పొత్తుపెట్టుకొంటుంది? ఆ పార్టీకి ఎంత బలం ఉందనే దానిపై ఫలితాలు ఉంటాయి. తెదేపాతో కలిసి సాగుదామనుకొన్నట్లయితే అది కేటాయించే కొన్ని సీట్లతో సర్దుకుపోక తప్పదు. అదే వామపక్షాలతో కలిసి సాగితే ఎక్కువ సీట్లకు పోటీ చేయగలదు కానీ గెలిచే అవకాశాలు తగ్గిపోవచ్చు. ఎందుకంటే అప్పుడు తెదేపా, వైకాపాలను డ్డీకొనవలసి ఉంటుంది. కనుక ఏవిధంగా చూసినా కేసీఆర్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలలో జనసేన పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు.