రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారకమందిరం ప్రారంభం

మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జన్మస్థలమైన తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన స్మారక మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. రెండేళ్ళ క్రితం జూలై 27వ తేదీన షిల్లాంగ్ లో ఒక ఉన్నత విద్యాసంస్థలో ఆయన విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తుండగా గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆయన జ్ఞాపకార్ధం రామేశ్వరంలో కలాం స్మారక మందిరం నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దానినే నేడు మోడీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి కలాం సోదరుడు వారి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు, అనేకమంది ప్రజా ప్రతినిధులు ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సభకు హాజరైన ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ కలాం ఆశయాలను, ఆయన కన్న కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. శ్రీరాముడు పుట్టిన అయోధ్య నుంచి ఆయన సతీసమేతంగా అడుగుపెట్టిన రామేశ్వరం వరకు రైలు, రోడ్డు మార్గాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అమృత్ పధకంలో భాగంగా రామేశ్వరంను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.