కరీంనగర్ కు హైదరాబాద్ వజ్రాలు

రాజధాని హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు వజ్ర బస్ సర్వీసులు నడుస్తున్న సంగత అందరికీ తెలిసిందే. త్వరలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాకు వాటిని నడిపించాలని టి.ఎస్.ఆర్.టి.సి. నిర్ణయించింది. వాటిలో కూడా మొబైల్ యాప్ ద్వారా లేదా ఆన్-లైన్ ద్వారా టికెట్స్  బుక్ చేసుకోవలసి ఉంటుంది. లేదా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఆర్టీసి కౌంటర్స్ లో టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. అవి కూడా నగరంలో అన్ని ప్రధాన బస్తీలకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళతాయి. బొరబండ, కూకట్ పల్లి, అమీర్ పేట, బాలానగర్, హఫీజ్ పేట, మొహిదీ పట్నం తదితర ప్రాంతాల గుండా ఈ వజ్ర బస్సులు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు వెళతాయి. త్వరలోనే కరీంనగర్ కు వజ్ర బస్ సర్వీసులు మొదలుకాబోతునాయి. 

ఈ సర్వీస్ పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, టికెటింగ్ విధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరక్షరాస్యులు లేదా గ్రామీణప్రజలకు మొబైల్ యాప్ లేదా ఆన్ లైన్ ద్వారా ఈ బస్సులో టికెట్స్ బుక్ చేసుకోవడం కానిపని కనుక ఎదురుగా బస్సు ఉన్నా దానిలో ప్రయాణించలేని పరిస్థితి. ఈ కారణంగా వజ్ర బస్సులు 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదని ఆర్టీసి గ్రహించినప్పటికీ ఈ లోపాన్ని సరిచేయకుండా బస్సులను నడుపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటిలో ప్రయాణించేవారి సంఖ్య పరిమితంగానే ఉంటుంది కనుక డ్రైవర్ కే టికెట్స్ ఇచ్చే బాధ్యత అప్పగించవచ్చు. ఇటువంటి పద్ధతి చాలా చోట్ల విజయవంతంగా అమలు చేస్తున్నారు కూడా. దాని వలన ఎవరైనా ఈ బస్సులో ప్రయాణించగలుగుతారు. ఆక్యుపెన్సీ శాతం కూడా పెరుగుతుంది కదా!