డ్రగ్స్ కేసులపై ప్రభుత్వ స్పందన..

తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ డ్రగ్స్ కేసులపై రోజూ చాలామంది అభిప్రాయాలు వినిపిస్తున్నారు. ఇది యావత్ సినీపరిశ్రమకు సంబంధించిన వ్యవహారంగా మేము చూడటం లేదు. దానిలో కొందరు వ్యక్తుల వ్యక్తిగత సమస్యగా మాత్రమే భావిస్తున్నాము. ఎక్సైజ్ శాఖకు లభించిన ఆధారాల సహాయంతోనే కొందరిని ప్రశ్నించవలసి వస్తోంది తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. కనుక ఎక్సైజ్ శాఖ సినీ పరిశ్రమఫై కక్ష కట్టినట్లు భావించడం సరికాదు. ఒకవేళ ఈ కేసులలో ఎవరైనా సినీ ప్రముఖులు దోషులుగా నిర్ధారించబడితే వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు. కానీ నిర్దోషులకు ఎటువంటి అన్యాయం జరుగకుండా చూస్తాము. గత ప్రభుత్వాలు ఈ మహమ్మారిని పట్టించుకోకపోవడం వలననే ఇంతవరకు వచ్చింది. ఇకనైనా దానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ఉన్నాము. ఈ డ్రగ్స్ సరఫరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర్ ఆగ్రహంతో ఉన్నారు. వాటిని పూర్తిగా అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు పూర్తి స్వేచ్చ, అధికారాలు ఇచ్చారు. ఈ కేసులతో సంబంధం ఉన్నవారు ఎంతపెద్దవారినైనా ఉపేక్షించబోము,” అని అన్నారు. 

ఈ డ్రగ్స్ కేసుల విషయంలో సిట్ చేస్తున్న విచారణపై కొందరు ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో ఒకవర్గం కూడా కట్టుతప్పినట్లు వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎట్టకేలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనిపై స్పందించారు. అది చాలా అవసరం కూడా. మంత్రి ఇచ్చిన ఈ వివరణ వలన సిట్ బృందం యొక్క మానసిక స్థైర్యం కూడా పెరుగుతుంది. ఈ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు లేవని, వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన చాటి చెప్పినట్లు అయింది.