
దివంగత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి శనివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు మృతిపై అనుమానాలున్నాయని పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నేడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
“నా కొడుకు గోపీనాథ్ డయాలసిస్ పేషంట్. అలాంటి పరిస్థితిలో హాస్పిటల్లో చేరితే వాడిని చూసేందుకు నన్ను లోనికి అనుమతించలేదు. కానీ కేటీఆర్‌ని లోనికి అనుమతించారు. పెద్దదాన్ని నన్ను లోనికి వెళ్ళనీయడం లేదని చెపితే ఆయన కూడా పట్టించుకోలేదు.
అయన బయటకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే, నేను ఆయాసపడుతూ పరిగెత్తుకు వెళ్ళి మా కుటుంబ సమస్య గురించి చెప్పాలని ప్రయత్నించాను. కానీ కేటీఆర్ నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అందుకు నేనేమీ ఆయనని తప్పు పట్టడం లేదు. అయన మాట్లాడాలనుకుంటే మాట్లాడేవాడు. కానీ వద్దనుకున్నాడు కనుక వెళ్ళిపోయాడు.
కానీ నా కొడుకు మాగంటి గోపీనాథ్ చనిపోతే ఆ విషయం వెంటనే మాకు ఎందుకు తెలియజేయలేదు? మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన గోపీనాథ్ చనిపోతే ఏపీలో ఉన్న మా బంధువులు, అమెరికాలో ఉన్న మనుమడు వచ్చే వరకు ఆగకుండా 5 గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు చేశారు? తండ్రి చనిపోతే కొడుకే అంత్యక్రియలు చేయాలి కదా? కానీ నా మనుమడు రాకుండానే ఎందుకు చేసేశారు?
నాకు నా కొడుకు గోపీనాథ్ మృతి పట్ల అనుమానాలున్నాయి. అందుకే పోలీసులకు పిర్యాదు చేసి విచారణ జరపాలని కోరాను,” అని మహానంద కుమారి అన్నారు.
ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే....
వీడియో బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ సౌజన్యంతో...