
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. తన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్న తేజస్వి యాదవ్ పై అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టడంతో అతనిని తన పదవికి రాజీనామా చేయమని నితీష్ కుమార్ కోరారు. కానీ తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకు రాజీనామా చేయబోడని నిన్న ప్రకటించారు. కనుక అతనిని పదవిలో నుంచి తొలగిస్తారని అందరూ భావిస్తుంటే ముఖ్యమంత్రే రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఒకవేళ అతనిని పదవిలో నుంచి తొలగించినట్లయితే, అప్పుడు లాలూ పార్టీ (ఆర్.జె.డి.) ఎలాగూ నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తుంది కనుక ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. కనుక నితీష్ కుమార్ తెలివిగా పావులు కదిపి తనే రాజీనామా చేసి లాలూ అండ్ సన్స్ కి షాక్ ఇచ్చారు.
నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు భాజపా సిద్దంగా ఉందని ముందే ప్రకటించింది. కనుక దాని మద్దతుతో నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు. కానీ అందులో ఈసారి లాలూ ఇద్దరు కొడుకులతో సహా ఆ పార్టీ సభ్యులు ఉండరు. అధికారం కోల్పోతామనే భయంతో ఒకవేళ ఆర్.జె.డి.కి చెందిన ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ వైపు మారినట్లయితే అప్పుడు కూడా లాలూ అండ్ సన్స్ దెబ్బయిపోతారు.