
డ్రగ్స్ కేసులో నోటీస్ అందుకొన్న నటి ఛార్మీ సిట్ విచారణను సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిలో ఆమె చేసిన ఆరోపణలకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చాలా ధీటుగా బదులిచ్చారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మేము బలవంతంగా ఎవరి దగ్గర నుంచి రక్తం, గోళ్ళు, జుట్టు శాంపిల్స్ సేకరించడంలేదు. నిందితుల అనుమతితోనే తీసుకొంటున్నాము. ఒకవేళ వారు నిరాకరిస్తే అదే విషయం కేస్ షీట్ లో వ్రాస్తున్నాము. ఈ కేసు కోర్టు విచారణకు వెళ్ళినప్పుడు న్యాయమూర్తి దానిపై తగిన నిర్ణయం తీసుకొంటారు. ఇక మహిళా నిందితులను పురుష అధికారులే విచారిస్తున్నారన్న ఆరోపణ కూడా సరికాదు. మేము పురుషులను విచారించేటప్పుడు కూడా జయలక్ష్మి అనే ఒక మహిళా అధికారి పాల్గొంటున్నారు. ఈరోజు కూడా ఆమె విచారణలో పాల్గొన్నారు.
నిందితులు ఎవరైనప్పటికీ వారిని విచారించవలసి వచ్చినప్పుడు మేము సుప్రీంకోర్టు సూచించిన నియమనిబంధనలు మేము తూచా తప్పకుండా పాటిస్తాము. కనుక మహిళా నిందితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తామనే ఆరోపణలు చేయడం సరికాదు. ఇటువంటి కేసులలో ఏవిధంగా కేసు ఫైల్ చేయాలో, ఏవిధంగా విచారించాలో మాకు పూర్తిగా తెలుసు. ఈ కేసుల విషయంలో కొందరు వ్యక్తులు తమ అభిప్రాయాల పేరిట తీర్పులు చెప్పడం సరికాదు. ఇకపై ఎవరైనా మా దర్యాప్తుకు అవరోధం కలిగేవిధంగా వ్యవహరించినట్లయితే వారిపై కూడా మేము చట్టప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కనుక కేసు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులపై లేదా వ్యవస్థలపై ఎవరూ నోటికి వచ్చినట్లు మాట్లాడ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
మాకు వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషం లేదు. ఎవరైనా తప్పు చేసినట్లు అనుమానం కలిగితే దానిని నిరూపించేందుకు ప్రాధమిక ఆధారాలు ఉంటేనే మేము అడుగు ముందుకు వేస్తాము తప్ప ఎవరిని పడితే వారికి నోటీసులు పంపించము. కనుక అందరూ మేము ఈ కేసులను పరిష్కరించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నా భద్రత గురించి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు విన్నాను. నాకు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చించింది. వారు నన్ను చాలా బాగా చూసుకొంటున్నారు. వారుండగా నాకు ఎటువంటి భయమూ లేదు,” అని అకున్ సబర్వాల్ అన్నారు.
ఈ కేసుల విచారణపై కొందరు అభిప్రాయాలు చెప్పడం గురించి ఆయన అన్న మాటలు దర్శకుడు రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల గురించే అని అర్ధం అవుతూనే ఉంది. వర్మకు తరచూ నోరు జారడం మళ్ళీ క్షమాపణలు చెప్పుకోవడం అలవాటే కనుక ఎక్సైజ్ శాఖ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు వారు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయవలసి వస్తుందని హెచ్చరించడంతో రామ్ గోపాల్ వర్మ నిన్న వారికి క్షమాపణలు చెప్పాడు.