యూపిలో గులాబీ...

ఒకప్పుడు గులాబీ అంటే గులాబీ పూవులేనని అందరూ భావించేవారు. తెరాస వచ్చిన తరువాత గులాబీ అంటే తెరాస అని అందరూ భావించే పరిస్థితి వచ్చింది. గులాబీ జెండాలు..గులాబీ పార్టీ..గులాబీ కండువాలు..ఆసుపత్రులలో గులాబీ దుప్పట్లు..కుర్చీలు..ఇలాగ గులాబీ అంటే తెరాసకు పర్యాయపదంగా మారింది. కనుక గులాబీ బస్సులు కూడా తెరాస సర్కార్ ప్రవేశపెట్టినవే అనుకొంటే పొరపాటు లేదు. కానీ గులాబీ రంగు తెరాసకే స్వంతం కాదు. మహిళలను వారి శక్తిని సూచించేందుకు కూడా ఆ రంగును ఉపయోగిస్తుంటారని అందరికీ తెలిసిందే.

కనుక ఇప్పుడు గులాబీ బస్సుల గురించి చెప్పుకొంటే అవి మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సులని అర్ధం అవుతుంది. యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో మహిళలకు సురక్షితంగా ప్రయాణించేందుకు గులాబీ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అందులో డ్రైవర్, కండెక్ట్రర్ మహిళలే ఉంటారని వేరేగా చెప్పనవసరం లేదు. వాటిలో సిసి కెమెరాలు, జిపిఎస్, పానిక్ బటన్ వంటి రక్షణ సౌకర్యాలు కలిగి ఉంటాయి. వాటిలో ప్రయాణం మహిళలకు సురక్షితమే కాకుండా చాలా సౌకర్యవంతంగా ఉండేందుకు అన్నిటినీ ఏసీ బస్సులనే ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో 50 బస్సులను ప్రవేశపెడుతున్నారు. అవి విజయవంతం అయితే మరిన్ని బస్సులు ప్రవేశపెట్టాలని యూపి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో బస్సులు, మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.