అందుకే డ్రగ్ కేసులు పైకి వచ్చాయిట

రాష్ట్రంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు తెరాస సర్కార్ పై మూకుమ్మడిగా విమర్శల వర్షం కురిపించాయి. మియాపూర్ భూకుంభకోణం కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన తెరాస సర్కార్ దానిలో నుంచి బయటపడేందుకే హటాత్తుగా ఈ డ్రగ్స్ కేసులను పైకి తీసుకువచ్చిందని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ డ్రగ్స్ కేసుతో ఆ కుంభకోణంపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. అయితే ఈ డ్రగ్స్ కేసుల్లో కూడా తెరాస నేతలున్నారని ఆరోపించారు. నగరంలో పబ్బుల యజమానులు అందరికీ నోటీసులు ఇచ్చామని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం, పబ్బులు నడుపుతున్న తెరాస నేతలకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ కేసులలో సినీపరిశ్రమలో పెద్ద తలకాయలను వదిలిపెట్టి చిన్నచిన్నవారికే ఎందుకు నోటీసులు ఇస్తోందని ప్రశ్నించారు. తెరాస సర్కార్ పాలన ఒక అవినీతి నుంచి మరొక అవినీతికి అన్నట్లు సాగుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

కాంగ్రెస్ నేతలు డికె అరుణ తదితరులు కూడా తెరాస సర్కార్ పై ఇంచుమించు ఇదేవిధమైన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసులలో ఎక్సైజ్ శాఖ అధికారులు తెరాస నేతలపై కూడా దృష్టి సారించాలని కోరారు. తెరాస సర్కార్ పాలన అవినీతి, కుంభకోణాలమయంగా మారిందని అన్నారు. ఒకపక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ మరోపక్క వాటిపై కోర్టులలో పిటిషన్లు వేయిస్తూ ప్రభుత్వమే వాటిని అడ్డుకొంటూ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులతో ఆడుకొంటోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు మాయమాటలు చెపుతూ రోజులు దొర్లించేస్తున్నారు తప్ప ఈ మూడేళ్ళలో చేసిందేమీ లేదని డికె అరుణ విమర్శించారు. డ్రగ్స్ కేసులలో తిమింగలాలను వదిలిపెట్టి చిన్న చిన్న చేపలను పట్టుకొంటున్నారని వామపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.