వర్మకు ఎక్సైజ్ అధికారులు వార్నింగ్

డ్రగ్స్ కేసులో సినీప్రముఖులను విచారించాదాన్ని తప్పు పడుతూ దర్శకుడు రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్స్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు, మాజీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసులో సినీపరిశ్రమను టార్గెట్ చేసి తనను తాను పెద్దహీరోగా భావించుకొంటున్నారని ట్వీట్ చేశాడు. ఎక్సైజ్ శాఖ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు సినీ పరిశ్రమను ఒక టీజర్ లాగ..ఒక ట్రైలర్ లాగ ఉపయోగించుకొని ప్రమోట్ చేసుకొంటోందని వర్మ విమర్శించాడు. అకున్ సబర్వాల్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ డ్రగ్స్ కేసుల విచారణ గురించి మీడియాకు ఇస్తున్న లీక్స్ వలన నోటీసులు అందుకొన్న  సినీ ప్రముఖులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

అకున్ సబర్వాల్ ను మీడియా అమరేంద్ర బాహుబలి స్థాయి హీరో అన్నట్లు చూపుతోందని కనుక బాహుబలి సినిమా దర్శకుడు అకున్ సబర్వాల్ ను హీరోగా పెట్టి బాహుబలి-3 తీస్తారేమో అని వ్యంగ్యంగా అన్నారు. పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను ఇంటరాగేషన్ చేసినట్లుగానే డ్రగ్స్ తీసుకొంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కూల్ పిల్లలను కూడా ఇంటరాగేట్ చేయగలరా? అని ప్రశ్నించారు. 

దానిపై ఎక్సైజ్ అధికారి ఒకరు స్పందిస్తూ, “మా శాఖ ఎప్పటి నుంచో ఇటువని దర్యాప్తులు, విచారణలు చేస్తూనే ఉంది. అయితే ఆ కాలంలో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, వెబ్ సైట్స్, ఇన్ని న్యూస్ ఛానల్స్ లేనందున మేము చేసే పని గురించి ఎవరికీ తెలియలేదు. కానీ మా శాఖ అప్పుడూ..ఇప్పుడూ ఎప్పుడూ కూడా ఒకేవిధంగా పనిచేస్తూనే ఉంటుంది. కానీ దర్శకుడు వర్మ మా శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ గురించి నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. మేము కోరుకొంటే వర్మపై కూడా కేసు బుక్ చేయగలము. కనుక ఆయన తన నోటిని కాస్త అదుపులో పెట్టుకొంటే మంచిది,” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి హెచ్చరించారు.