
తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా డ్రగ్స్ కేసులో కెల్విన్ ను అరెస్ట్ చేయడంతో అన్ని రంగాలకు చెందిన వ్యక్తుల పేర్లు బయటపడుతున్నాయి. కనుక ఈ డ్రగ్స్ కేసులను విచారణ, దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్ళు రావడం సహజమే. ఈ కేసులలో ఇంతవరకు సినీపరిశ్రమ వ్యక్తుల పేర్లు మాత్రమే బయటకు వచ్చినప్పటికీ వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలున్నాయి.
ఈ డ్రాగ్ రాకెట్ ను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు గత వారం రోజులుగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు బయటపడింది. ఆ కాల్స్ చేస్తున్న వ్యక్తి ఆఫ్రికా యాసలో మాట్లాడుతున్నాడని, అది ఇంటర్నేషనల్ కాల్ అని ఇంటలిజన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంటే తెలుగు సినీ పరిశ్రమలో వ్యక్తులకు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబందాలు ఉన్నాయనే అనుమానాలు నిజమేనని స్పష్టం అవుతోంది.
అకున్ సబర్వాల్ కు ఫోన్ చేసిన వ్యక్తి “నీ పిల్లలు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారో?” మాకు తెలుసు అని బెరించినట్లు తెలుస్తోంది. ఇది అచ్చం సినిమాలలో విలన్లు చేసే హెచ్చరికలాగే ఉండటం విశేషం. ఈ హెచ్చరికలతో అప్రమత్తం అయిన పోలీస్ శాఖ అకున్ సబర్వాల్ తో సహా ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు భద్రతను కల్పించినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ వ్యవహారం చూడబోతే ఇక్కడితో ఆగేట్లులేదు. మున్ముందు ఇటువంటి వార్తలు, విశేషాలు ఇంకా ఎన్ని వినాలో? ఏమైనప్పటికీ ఎక్సైజ్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.