
మాదకద్రవ్యాల కేసులో నోటీసు అందుకొన్న ప్రముఖ సినీ నటుడు తరుణ్ కొద్ది సేపటి క్రితం తన తండ్రి చక్రపాణితో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకొన్నారు. ప్రవేశద్వారం వద్ద అతని కోసం ఎదురుచూస్తున్న అధికారులు వెంటనే అతనిని 5వ అంతస్తుకు తోడ్కొని పోయారు. కొద్ది సేపటి క్రితమే సిట్ అధికారులు తరుణ్ ను ప్రశ్నించడం మొదలుపెట్టారు.
హైదరాబాద్ లో ‘ఆన్’ అనే ఒక పబ్ లో తరుణ్ ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు. 2009లో ప్రారంభమైన ఆ పబ్ తన రెగ్యులర్ ఖాతాదారులకు మాదకద్రవ్యాలు అందింస్తోందని ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఆ కారణంగానే తాను ఆ పబ్ తో చాలా కాలం క్రితమే వ్యాపార సంబంధాలు తెంచుకొన్నానని కనుక దాని కేసులతో తనకు సంబంధం లేదని తరుణ్ వాదన. తనకు మాదకద్రవ్యాలు వాడే అలవాటు లేదని తరుణ్ మీడియాతో అన్నారు. తరుణ్ చెపుతున్నది నిజమే అయితే సిట్ విచారణ త్వరగానే ముగిసే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈరోజు నగరంలోని బార్లు, పబ్ యజమానులతో సమావేశం కానున్నారు. అయితే మద్యం వ్యాపారంలో ఎక్కువగా రాజకీయనాయకులు లేదా వారి బంధువులే ఉంటారు కనుక బార్ యజమానులతో సమావేశం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో చూడాలి.