సుబ్బరాజు చెప్పింది నిజమేనా?

ప్రముఖ తెలుగు సినీనటుడు సుబ్బారాజుని డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించారు. ఆ విచారణలో తాను దర్శకుడు పూరీ జగన్నాథ్ కు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి అందించేవాడిని అని చెప్పినట్లు మీడియాలో వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఆ వార్తలను అతను కానీ, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సభర్వాల్ గానీ దృవీకరించలేదు. తాను విచారణలో అధికారులకు పూర్తిగా సహకరించానని మళ్ళీ పిలిస్తే విచారణకు హాజరవుతానని మాత్రమే చెప్పాడు. అకున్ సభర్వాల్ కూడా అతను విచారణలో తమకు పూర్తిగా సహకరించాడని మాత్రమే చెప్పారు. 

అయితే విచారణకు హాజరవుతున్న వారు ఇండస్ట్రీలో డ్రగ్స్ సేవించే అలవాటున్న ఇతరుల పేర్లు, వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పేర్లను బయట పెడుతున్నారు కనుక సుబ్బరాజు చెప్పినట్లు వస్తున్న ఈ వార్తలు నిజమైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ కుప్పకూలే ప్రమాదం ఉంది. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి పూరీకి అందించడం నిజమయితే ముందుగా సుబ్బరాజు ఆ తరువాత పూరీ జగన్నాథ్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు. ఇంకా పూరీ బ్యాచ్ కే చెందిన రవితేజ, ఛార్మీ, ముమ్మైత్ ఖాన్, శివబాలాజీ తదితరులు విచారణలో ఇంకా ఎన్ని నిజాలు బయటపడతాయో చూడాలి. అయినా అందరి విచారణ పూర్తయి సిట్ అధికారులు నివేదిక సమర్పించక మునుపే విచారణకు హాజరైనవారు అందరూ దోషులేనని భావించడం..వారు చెపుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను నమ్మడం అనవసరం.