
డ్రగ్స్ కేసులో నోటీస్ అందుకొన్న నటి ముమ్మైత్ ఖాన్ విచారణకు డేట్ ఫిక్స్ అయింది. ఆమె జూలై 27వ తేదీన విచారణకు హాజరుకాబోతోందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు తెలియజేశారు. ఆమె ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనే అనుమానం ఉండేది. కానీ బిగ్ బాస్ షోలో ఉన్న ఆమెతో నేరుగా మాట్లాడి ఈ నెల 27న విచారణ జరిపేందుకు నిర్ణయించామని చెప్పారు.
ఈరోజు నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు ఉదయం 10.45 నుంచి రాత్రి 8.30 వరకు విచారించారు. ఆయన విచారణ పూర్తయిందని రేపు ఇదే కేసులో నటుడు తరుణ్ ను విచారిస్తామని సభర్వాల్ చెప్పారు. పూరీ, శ్యాం కే నాయుడు, సుబ్బరాజు ఇచ్చిన ఆధారాలతో నగరంలోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానించబడుతున్న 16 బార్లు, పబ్బు యజమానులతో సిట్ అధికారులు శనివారం తమ కార్యాలయంలో సమావేశం కానున్నారు. టాలీవుడ్ నటీనటుల వరుస విచారణలలో రోజూ కొత్తకొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంతవరకు రాజకీయ నేతల పుత్ర రత్నాల పేర్లు బయటకు రాకపోవడం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు ఒక ఏపి మంత్రి కుమారుడు పట్టపగలే త్రాగి వాహనం నడపడే కాకుండా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక వివాహిత ముస్లిం మహిళ చెయ్యి పట్టుకొని బలవంతం చేయబోయాడు. అదేవిధంగా మరో ఏపి మంత్రి కుమారుడు అర్దరాత్రి పూట అతివేగంగా కారును నడిపిస్తూ మెట్రో పిల్లర్ ను గుద్దుకొని చనిపోయాడు. కనుక రాజకీయనేతల పేర్లు ఇంకా ఎప్పుడు బయట పడతాయో అసలు బయట పడతాయో లేదో?