కేటిఆర్ పై వైకాపా కూడా గుస్సా...క్యో?

తెలంగాణా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ని ఒక్కో పార్టీ ఒక్కో కారణంతో నిందిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వైకాపా కూడా చేరిపోయింది. వారం రోజులలోగా హైదరాబాద్ రోడ్ల పరిస్థితిని, సమస్యలను పరిష్కరించకపోయినట్లయితే జి.హెచ్.ఎం.సి.ని ముట్టడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ మంత్రి కేటిఆర్ ను హెచ్చరించారు.

“చిన్న చినుకు పడితే హైదరాబాద్ నీట మునుగుతుంటుంది. చిన్న వాన పడితే చాలు..నగరంలో అనేక చోట్ల ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి. రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి.  పైగా నగరంలో ఎక్కడ చూసినా గోతుల రోడ్లే కనిపిస్తుంటాయి. గ్రేటర్ ఎన్నికలప్పుడు తెరాసను గెలిపిస్తే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేస్తామని హామీలు గుప్పించి గెలిచారు. మీరు చెపుతున్న విశ్వనగరం ఇదేనా? ఎన్నికలలో గెలిచాక ప్రజలను, నగరాన్ని గాలికి ఒదిలేశారు. నగరాన్ని చక్కదిద్దడానికి మీకు ఇంకా ఎన్నేళ్ళు కావాలి? వారం రోజులలోగా హైదరాబాద్ రోడ్ల పరిస్థితిని, సమస్యలను పరిష్కరించకపోయినట్లయితే జి.హెచ్.ఎం.సి.ని ముట్టడిస్తాము,” అని శివకుమార్ మంత్రి కేటిఆర్ ను హెచ్చరించారు. 

వైకాపా చెప్పిన మాటలు నిజమే కానీ నగరంలో నుంచి మురుగు నీరు, వర్షపు నీరు బయటకు పారేందుకు ఏర్పాటు చేయబడ్డ నాలాలు ఆక్రమణలకు గురైనందున వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్రమనదారులు కోర్టులను ఆశ్రయిస్తున్న కారణంగా ఆక్రమణల తొలగింపులు ఆలస్యం అవుతున్నాయి. ఇక ఎప్పుడో నవాబుల కాలంలో ఉన్న జనాభాకు సరిపడినట్లు నిర్మించబడిన కాలువలను వెడల్పు చేయాలన్నా కోర్టుల చుట్టూ తిరుగకతప్పడం లేదు. ఇక నగరంలో రోడ్ల నాణ్యాతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో చాలా కటినంగా వ్యవహరిస్తోంది. అక్రమాలకు పాల్పడినవారిపై కటిన చర్యలు తీసుకొంటోంది. ఇటువంటి అనేక సమస్యల కారణంగా హైదరాబాద్ అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. 

ఈ విషయాలన్నీ ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం తమ హక్కుగా అవి భావిస్తుంటాయి కనుక విమర్శిస్తుంటాయి. వాటిలో వైకాపా కూడా చేరడమే వింత. తెలంగాణాలో ఎన్ని సమస్యలున్నా ఎప్పుడూ మాట్లాడని వైకాపా ఇప్పుడు మాట్లాడటం, కేటిఆర్ కు హెచ్చరికలు జారీ చేయడం చాలా విడ్డూరంగానే ఉంది. బహుశః తెలంగాణా ప్రజలకు వైకాపా అనే ఒక పార్టీ రాష్ట్రంలో ఉందని గుర్తు చేయడానికే నోరు విప్పి మాట్లాడారేమో?