
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మంత్రి కేటిఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. “తెలంగాణాలో అతిపెద్ద డ్రగ్స్ కుంభకోణం బయటపడింది. దానిలో తెరాస వారసుడు (కేటిఆర్) సన్నిహితులకు సంబంధాలు ఉన్నాయి. వారిని రక్షిస్తారా..విచారిస్తారా..వేచి చూడాలి” అని ట్వీట్ చేశారు.
దిగ్విజయ్ సింగ్ ఆరోపణలపై మంత్రి కేటిఆర్ చాలా అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే ట్వీట్టర్ ద్వారానే ఘాటుగా జవాబిచ్చారు. “మీరు పూర్తిగా ఓడిపోయారు సర్. ఇక విశ్రాంతి తీసుకోవలసిన సమయం వచ్చింది. మీ వయసుకు తగిన పనులు చూసుకొంటే మంచిది. కనీసం ఇప్పటికైనా మీరు ‘తెలంగాణా’ అనే పదాన్ని సరిగ్గా వ్రాయడం నేర్చుకొన్నందుకు చాలా సంతోషం,” అని ట్వీట్ చేశారు.
ఇదివరకు తెలంగాణా పోలీస్ శాఖ స్వయంగా యువతను ఉగ్రవాదంవైపు వెళ్ళేందుకు ప్రోత్సహిస్తోందని ఆ తరువాత వారినే అరెస్ట్ చేసి ఉగ్రవాదులను పట్టుకోన్నామని గొప్పలు చెప్పుకొంటోందని దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానిపై ఆయనకు, తెరాస మంత్రులకు మద్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, ఆయనను కోర్టు కీడుస్తామని తెరాస నేతల హెచ్చరికలు, వాటిని ఆయన స్వాగతించడం జరిగింది. కానీ ఆ తరువాత ఆ విషయం అటకెక్కిపోయింది.
ఆ తరువాత మియాపూర్ భూకుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందని దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేసినప్పుడు మళ్ళీ వారి మద్య కొన్ని రోజులు వాదోపవాదాలు జరిగాయి. తాజాగా ఈ ఆరోపణలపై మొదలయ్యాయి. బహుశః ఇవి కూడా అలాగే ముగుస్తాయేమో?
అయితే దిగ్విజయ్ సింగ్ ఇంత తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు, ‘వాటిలో దోషులు ఎంత పెద్దవారైనా..సన్నిహితులైన శిక్షిస్తామనో లేదా చట్టం తనపని చేసుకుపోతుందనో’ స్టాండర్డ్ జవాబు కేటిఆర్ చెప్పి ఉంటే సరిపోయేది కానీ దిగ్గీరాజ ఆరోపణలకు నేరుగా జవాబు చెప్పకుండా ఆయన ముసలితనం గురించి మాట్లాడటం అనవసరమే.