
హైదరాబాద్ లో బయటపడిన డ్రగ్స్ కేసుపై దర్యాప్తు, విచారణ కొనసాగుతున్న కొద్దీ దాని విశ్వరూపం మెల్లగా బయటపడుతోంది. ఇందుగలదు..అందులేదని సందేహం వలదు ఎందెందు వెదికినా నేనుందునన్నట్లుగా అన్ని రంగాలకు అది వ్యాపించినట్లు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారించిన తరువాత మూడు ప్రముఖ కొరియర్ సంస్థలు ఆ డ్రగ్స్ రవాణాలో ఉన్నట్లు బయటపడింది. తాజాగా పత్రికారంగానికి కూడా ఆ మహమ్మారి వ్యాపించిందనే వార్త విస్మయం కలిగిస్తోంది.
సినిమావాళ్ళ పేర్లు బయటపడగానే ఇన్ని రోజులుగా వారిని కాకుల్లాగా పొడుస్తూ బాధిస్తున్న మీడియాలోనే 15 మంది విలేఖరులుకు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం బయటపడింది. ఒక మీడియా సంస్థ అధినేతకు కూడా డ్రగ్స్ అలవాటున్నట్లు పూరీ జగన్నాథ్ బయటపెట్టినట్లు సమాచారం. వారందరికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపించినట్లు సమాచారం. డ్రగ్స్ సేవించే అలవాటు ఉన్నప్పటికీ బయటపడని కొందరు సినీ ప్రముఖుల పేర్లను పూరీ సిట్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. కనుక వారికీ త్వరలోనే నోటీసులు వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చు.
మీడియా విలేఖరులను విచారిస్తే మళ్ళీ వారు ఇంకెంతమంది పేర్లు బయటపెడతారో ఎవరూ ఊహించలేరు. కనుక ఆ జాబితా పెరుగుతున్న కొద్దీ వాటిలో నిందితులుగా పేర్కొనబడిన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కేసులను అటకెక్కించమని ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆ ఒత్తిళ్లను తట్టుకొని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృడంగా నిలబడాలని ప్రజలు అందరూ కోరుకొంటున్నారు. మరి ఆయనకు ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయగల శక్తి, ధైర్యం ఉన్నాయో లేవో మున్ముందు తెలుస్తుంది.