అయ్యో! అవి కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్నాయా?

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన ఆధారాలతో సిట్ అధికారులు హైదరాబాద్ నగరంలో 3 కొరియర్ కంపెనీలకు నిన్ననే నోటీసులు ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సభర్వాల్ మీడియాకు తెలిపారు. ప్రముఖ కొరియర్ కంపెనీలు డి.హెచ్.ఎల్., బ్లూడార్ట్, ఫెడ్-ఎక్స్ కంపెనీలకు నోటీసులు పంపామని ఆయన తెలిపారు. అయితే ఆ మూడు కొరియర్ కంపెనీల గురించి పూరీ జగన్నాథ్ తమకు ఏమి చెప్పారో మీడియాకు చెప్పడానికి అయన నిరాకరించారు. 

పూరీ చెప్పింది నిజమే అయితే అందులో గొప్ప రహస్యమేమీ ఉండకపోవచ్చు. ఆ సంస్థలు తాము రవాణా చేస్తున్న పార్సిల్స్ లో ఏ వస్తువులు లేదా పదార్ధాలు ఉన్నాయనే విషయం పట్టించుకోకుండా రవాణా చేస్తూ ఉండి ఉండాలి. లేదా ఆ సంస్థలకు చెందిన ఉద్యోగులలో ఎవరైనా డబ్బుకు ఆశపడి మాదకద్రవ్యాల సరఫరాదారులకు సహకరిస్తూ వాటి రవాణాకు తోడ్పడుతూ ఉండి ఉండవచ్చు. సిట్ విచారణలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

కానీ కొరియర్ ద్వారా మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లయితే అవి ప్రమాదఘంటికలుగానే భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవిధంగా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా..ఎవరి నుంచి ఎవరికైనా చాలా సులువుగా మాదకద్రవ్యాల రవాణా చేస్తూ చాప క్రింద నీరులా అంతటా విస్తరించే ప్రమాదం ఉంటుంది. కనుక ఎక్సైజ్ శాఖ అధికారులు తమ తనికీల పరిధిని మరింత విస్తరించవలసి ఉంటుంది.