పూరీని అరెస్ట్ చేయడం లేదు: అకున్ సభర్వాల్

మాదకద్రవ్యాల కేసులో సిట్ అధికారుల ముందు నేడు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఉదయం 10.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే కెల్విన్ తో పరిచయాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఛార్మీ హీరోయిన్ గా నటించిన జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్ లో కెల్విన్ కూడా పాల్గొన్న ఫోటోలను చూపి అతనితో ఏవిధంగా ఏస్థాయిలో పరిచయం ఉందో కనుగొనే ప్రయత్నం చేశారు. అనంతరం పూరీకి మత్తుమందులు సేవించే అలవాటు ఉందా లేదా అని తెలుసుకొనేందుకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైద్యుడిని రప్పించి రక్తం శాంపిల్స్ కూడా తీసుకొన్నారు. మరికొద్ది సేపటిలో పూరీ విచారణ ముగుస్తుందని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ మీడియాకు తెలిపారు. పూరీని అరెస్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు. పూరీ ఇచ్చిన ఆధారాలతో కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకొనేందుకు రెండు ప్రత్యేక బృందాలు కాసేపటి క్రితం బయలుదేరాయి. రేపు కెమెరా మ్యాన్ శ్యాం కె నాయుడిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు.