ఆ నలుగురు మంత్రులకు నోటీసులు..

రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీలు ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టినవారు నేటికీ పాత పార్టీల ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపిలో వైకాపా నుంచి అధికార తెదేపాలోకి మారిన వైకాపా ఎమ్మెల్యేలలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు లభించాయి. తెలంగాణాలో పార్టీ ఫిరాయించినవారిపై ప్రతిపక్ష పార్టీలు ఎంతగా పోరాడినా ఫలితం లేకపోవడంతో పోరాడటం మానుకొన్నాయి. 

వైకాపా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారికి తెదేపా ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవ్వడాన్ని టి.శివప్రసాద్ రెడ్డి అనే జర్నలిస్ట్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ టి.రజనితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏపి శాసనసభ ప్రధానకార్యదర్శికి, మంత్రులు ఎన్.అమర్ నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ,ఆర్.ఎస్.కృష్ణసాగర్ రావు మరియు సి.ఆదినారాయణ రెడ్డికి సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

ఒకవేళ ఈసారి న్యాయస్థానం ఆ నలుగురు మంత్రులపై అనర్హత వేటు వేయగలిగితే బహుశః తెరాసలో చేరిన తెదేపా, కాంగ్రెస్, వైకాపా ఎమ్మెల్యేలపై కూడా ఆ మూడు పార్టీలు కోర్టులో మళ్ళీ కేసులు వేయవచ్చు. పార్టీ ఫిరాయించినవారిపై వేటు వేయాలా వద్దా అనే నిర్ణయం స్పీకరు పరిధిలో ఉంటుంది కనుక దానిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేకపోవచ్చు కానీ ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు వేరే పార్టీకి చెందిన ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడానికి రాజ్యాంగం ఆమోదించకపోవచ్చు. కనుక వారిపై హైకోర్టు అనర్హత వేటు వేసే అవకాశం ఉందని భావించవచ్చు. అదే కనుక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయించినవారికి కొత్త చిక్కు వచ్చిపడినట్లే లెక్క.