తిట్టిన నోటితోనే పొగడ్తలా పవన్?

వెంకయ్య నాయుడు పేరు ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు కాగానే అంతవరకు ఆయనను విమర్శిస్తున్న వారికి కూడా అకస్మాత్తుగా ఆయన చాలా మంచివాడుగా కనబడుతుండటం విశేషం. ఉదాహరణకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఆయననే దోషిగా భావిస్తుండేవారు. ఆయన ఆంధ్రాకు చేసిందేమీ లేదని విమర్శిస్తుండేవారు.  ఆయనను నోటికి వచ్చినట్లు విమర్శించి భాజపాను శత్రువుగా మార్చుకొన్నారు. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వెంకయ్యను పొగడటం విశేషం. 

ఆయనకు అభినందనలు తెలియజేస్తూ నిన్న జారీ చేసిన ఒక ప్రకటనలో “సీనియర్ రాజకీయ నాయకుడిగా అపార అనుభవం కలిగిన ఆయన ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని నమ్ముతున్నాను. ఒక తెలుగు బిడ్డ ఆ పదవి చేపట్టడం తెలుగువారందరికీ గర్వ కారణం. ఇది తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. వెంకయ్య నాయుడుని ఆ పదవికి ఎంపిక చేసినందుకు భాజపా అధిష్టానికి అభినందనలు తెలియజేస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

ప్రత్యేక హోదా పేరుతో ఏపిలో రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం భూటక పోరాటాలు చేస్తుంటే డిల్లీలో ఉండే వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల కోసం..ముఖ్యంగా ఏపి కోసం చాలా శ్రమించి అనేక ప్రాజెక్టులు, వాటికి అనుమతులు, నిధులు వంటివి సమకూర్చిపెట్టారు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఆయనను విమర్శిస్తూనే ఉన్నారు. అందుకు ఆయన చాలా బాధపడ్డారు కూడా. అయన బాధను ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ఆయనను మనసారా అభినందిస్తున్నందుకు చాలా సంతోషం.