
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి మంగళవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు సభాసమావేశాలు ప్రారంభం కాగానే ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్ లోని దళితులపై జరిగిన దాడి అంశం లేవనెత్తి దానిపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరారు. కానీ ప్రతిపక్షాలు వేరే ఇతర అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి ఉండటంతో సభాపతి ఆమెకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సభాపతి ఆమెను వారించారు.
అందుకు ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే దానిపై సభలో మాట్లాడేందుకు వీలులేదంటే ఇంకా సభలో సభ్యురాలిగా కొనసాగడం అనవసరం. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను,” అని హెచ్చరించారు. కానీ సభాపతి ఆమె హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను సభాపతికి అందజేసి బయటకు వచ్చేశారు. ఆమె చర్యకు సభలో అందరూ నిర్ఘాంతపోయారు. అయితే భాజపా సభ్యులు వెంటనే తేరుకొని సభాపతి పట్ల అగౌరవంగా ప్రవర్తించినందుకు మాయావతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు రాజీనామా చేశానని మాయావతి చెపుతున్నప్పటికీ వేరే బలమైన కారణం ఏదో ఉండి ఉండవచ్చు. అదేమిటో త్వరలోనె బయటపడవచ్చు.