డిల్లీలో టిజెఎసి ధర్నా!

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో ఆగస్ట్ 27వ తేదీన డిల్లీలో ఒక సమావేశం నిర్వహించబోతున్నట్లు టిజెఎసి సోమవారం ప్రకటించింది. తెరాస సర్కార్ నియంతృత్వ పోకడల గురించి జాతీయస్థాయిలో అందరికీ తెలిపేందుకే ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించడాన్ని నిరసిస్తూ ఆగస్ట్ 22వ తేదీన డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేయబోతున్నట్లు టిజెఎసి ప్రకటించింది. మాదకద్రవ్యాలను వ్యతిరేకిస్తూ ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో వచ్చే నెల 6వ తేదీన హైదరాబాద్ లో పాదయాత్ర నిర్వహిస్తామని టిజెఎసి ప్రతినిధులు ప్రకటించారు. 

ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో తెరాస సర్కార్ పై పోరాటాలు చేస్తున్న టిజెఎసి, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ జాతీయస్థాయిలో పోరాటం చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. డిల్లీలో నిర్వహించబోయే సమావేశం మరియు ధర్నా వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని టిజెఎసి భావిస్తున్నట్లుంది. అయితే ఇటువంటి చర్యలు తెరాస సర్కార్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకతను వ్యాపింపజేయడానికి ఏమైనా ఉపయోగపడవచ్చేమో కానీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపవని చెప్పవచ్చు. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిగట్టుకొని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెడుప్రచారం చేస్తున్నారని తెరాస నేతలు, మంత్రులు ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు డిల్లీలో టిజెఎసి చేపట్టబోయే ఈ కార్యక్రమాల వలన వారి ఆ ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది అంతే.