కేటిఆర్ కు రోజులు దగ్గర పడ్డాయి అందుకే..

తెలంగాణా ఐటి శాఖ మంత్రి కేటిఆర్ నిన్న తెరాస విద్యార్ధి సంఘం నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై చేసిన తీవ్ర విమర్శలకు, కాంగ్రెస్ నేతలు కూడా అంతే తీవ్రంగా జావాబిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్ లో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

షబ్బీర్ అలీ మాట్లాడుతూ, “చాలా చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకొన్న కేటిఆర్ కు అహంకారం నెత్తికి ఎక్కి కాంగ్రెస్ పార్టీ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలే ఆయనను రాళ్ళతో తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని పాతాళానికి త్రొక్కేయాలని కేటిఆర్ చెపుతున్నారు. కానీ తెరాసనే ప్రజలు పాతాళంలోకి త్రొక్కేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని తిడితే ఆకాశంపై ఉమ్మి వేసినట్లేనని కేటిఆర్ గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.

“సంస్కారం లేకుండా మాట్లాడేవారు మంత్రులైన ఎవరైనా ఒక్కటే. అటువంటి వారిని ఎక్కడ ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు. గతంలో మా పార్టీని అణచివేయాలని ప్రయత్నించిన ఎన్నో పార్టీలు కనబడకుండా పోయాయి. తెరాసకు కూడా అదే గతి పట్టవచ్చు,” అని కె జానారెడ్డి అన్నారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక తెరాస సర్కార్ కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతోంది. తెరాస కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసుతో కాంగ్రెస్ నేతలకు ఎటువంటి సంబంధం లేదని తెలిసినా వారిపై తప్పుడు కేసులు పెట్టడమే అందుకు ఉదాహరణ. తెరాస తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నేతలపై తప్పుడు కేసులు పెడుతుంటే మేము చూస్తూ ఊరుకొంటామని అనుకోవద్దు. మంత్రి కేటిఆర్ కు రోజులు దగ్గర పడుతున్నట్లే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో ఎవరి పార్టీ పాతాళానికి పోతుందో చూద్దాం,” అని అన్నారు.