
తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన తెరాస విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో విద్యార్ధి నాయకులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రానికి మొదటి శత్రువు. ఆ పార్టీ దశాబ్దాలుగా తెలంగాణాకు, ప్రజలకు అన్యాయం చేస్తూనే ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతూనే ఉంది. ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేసి అడ్డుకొంటున్నారు. కేసీఆర్ 14 ఏళ్ళపాటు సుదీర్ఘంగా చేసిన పోరాటాలు, యువత బలిదానాల వలననే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వడం అనివార్యం అయ్యింది తప్ప అది తెలంగాణా ప్రజలపై అభిమానంతోనో లేదా వారి ఆకాంక్షలను గుర్తించో తెలంగాణా ఇవ్వలేదు. తెలంగాణా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే మొదటి శత్రువు.
మిషన్ భగీరథకు రూ.40,000 కోట్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన చిత్తూరు జిల్లా ఒక్కదానికే రూ.9,000 కోట్లు కేటాయించుకొన్నప్పుడు ఎందుకు నోరెత్తలేదు. ఒక జిల్లాకే రూ.9,000 కోట్లు అవసరమైనప్పుడు యావత్ తెలంగాణా రాష్ట్రానికి రూ.40,000 కోట్లు అవసరం కాదా? మిషన్ భగీరథను రూ.1,000 కోట్లకే పూర్తి చేయవచ్చని చెపుతున్న కాంగ్రెస్ నేతలు మరి తమ ప్రభుత్వ హయంలో ఆపని ఎందుకు చేయలేకపోయారు?
మా ప్రభుత్వం ఏపని చేపట్టినా అందులో బారీగా అవినీతి జరిగిపోతోందని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలను ఎందుకు నిరూపించలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు నేను జవాబు చెపితే వారు నన్ను బచ్చా అంటున్నారు. నేను మంత్రిగా పనిచేస్తున్నాను. పెళ్ళి చేసుకొన్నాను. కానీ ఇంతవరకు ఎటువంటి బాధ్యత చేపట్టకుండా పెళ్ళి చేసుకోకుండా ఉన్న రాహుల్ గాంధీని ఏమనాలి? అతను బచ్చా కాదా?” అని ప్రశ్నించారు మంత్రి కేటిఆర్.